కాళేశ్వరంతో పాటు కుంగుతున్న బీఆర్ఎస్

కాళేశ్వరంతో పాటు కుంగుతున్న బీఆర్ఎస్

కుంగిన మేడిగడ్డ బ్యారేజ్​ను ఆకునూరి మురళి,  ప్రొ. వినాయక రెడ్డి,  ప్రొ. లక్ష్మీనారాయణ, నేను నవంబర్ 8న పరిశీలించడం జరిగింది. పునాది నుంచి పైవరకు 20 వ పిల్లర్  రెండుగా చీలింది. 15వ పియర్ నుంచి 21 వరకు కుంగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏడో బ్లాకు మొత్తం  పిల్లర్లు కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించకపోతే ఇక మేడిగడ్డ ఉత్తదే.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఇలాగే ఏ పిల్లరైనా ఎప్పుడైనా కుంగిపోయి కూలిపోవచ్చని డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం వెల్లడించింది. ప్రాణహిత తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి మార్చిన కేసీఆర్ భారీ అవినీతి, రీ-ఇంజినీరింగ్ తప్పిదం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు, భగీరథ తదితర ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపు లేని అవినీతికి పాల్పడింది. 

మొట్టమొదట నీళ్లను ఎత్తిపోసే మేడిగడ్డ ప్రధాన బ్యారేజీ భూమిలో కుంగి పగుళ్లు తేలింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఆగమేఘాలపై సముద్రంలోకి వదిలారు. 7 వ బ్లాక్ లోని 15 నుంచి 21 పిల్లర్ల వరకు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి.  తెలంగాణ జనం ఖజానాను ఆగమేఘాల మీద దోచుకోవాలనే ఏకైక లక్ష్యంతో  ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథ చేపట్టింది.  ఒకే రోజు లక్ష 80 వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ వేయడం వల్ల, బ్యారేజీ  పునాదిలో బలంగా పట్టుకోక పోవడంవల్లనే  గ్యాప్స్,  క్రాక్స్ వచ్చాయి. అనేక చోట్ల పిల్లర్ల కింది నుంచి  సిపేజీ బుంగలు ఏర్పడ్డాయి. మేడిగడ్డ వద్ద  పునాది బలమైన రాతినేల కాదని, బలహీనమైన ఇసుక నేలని నాడు  జియాలజిస్టులు వెల్లడించారు. అయితే, దోపిడీయే లక్ష్యంగా నిర్మాణంలో అన్ని ప్రమాణాలను గాలికొదిలేశారు. 

క్లౌడ్​ బరస్టా?

లక్ష 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రారంభించిన మూడేళ్లకే భూమిలో  కుంగిపోయినా చర్యలు చేపట్టక పోవడంలోని ఆంతర్యం ఏమిటి అనేది కమలం పార్టీ చెప్పాలి. కాగా, సంఘ విద్రోహ శక్తులు బాంబు పెట్టారని తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్​ పక్కదారి పట్టిస్తోంది. జులై 2022 గోదావరి వరదలకు కాళేశ్వరం బాహుబలి మోటార్లు విధ్వంసం అయితే చైనా క్లౌడ్ బరస్ట్ చేసిందని, ముఖ్యమంత్రి  స్థాయిని మరిచి కేసీఆర్​ ఘోరమైన అబద్ధాలతో తెలంగాణను వంచించారు. భజనపరులు  కాళేశ్వరం బ్యారేజీ కింద స్వల్ప భూకంపం వచ్చిందని ప్రకటిస్తున్నారు. కాళేశ్వరం కుంగడానికి బాంబు కారణమా? స్వల్ప భూకంపమా? అంతులేని అవినీతా? ఏది సత్యం.

86 గేట్లు వైఫల్యం చెందితే..

గత తొమ్మిదేండ్లలో పుష్కలమైన వర్షాలు, పాత గ్రావిటీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు భూగర్భ జలాలతో పండిన పంటనంతటిని కాళేశ్వరం నీళ్ల పంటలే అని వందల కోట్ల ప్రకటనలతో అబద్ధాలతో మార్మోగించారు. కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యత, నిర్వహణ లోపాల కారణంగా కుంగిందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథార్టీ పేర్కొంది. ప్లానింగ్ చేసిన విధంగా డిజైన్ జరగలేదు, డిజైన్ చేసినట్లుగా నిర్మాణం చేపట్టలేదు.

కుంగిన ఏడో నం. బ్లాక్ ను మరమ్మతు చేయడానికి కుదరదని, మొత్తం బ్లాక్ పునాదుల నుంచి తొలగించి, తిరిగి కొత్తగా నిర్మాణం చేయాలని సూచించింది.  పగుళ్లు ఏర్పడిన పిల్లర్లను కొత్తగా నిర్మించే వరకు, బ్యారేజీని ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ నిర్మాణం మొత్తం ఇలాగే జరిగి ఉంటే, ఇతర బ్లాకులు కూడా అంటే 86 గేట్లు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. అప్పుడు మొత్తం 86 గేట్ల బ్యారేజీని కొత్తగా నిర్మాణం చేయాల్సి వస్తుందని డ్యామ్ సేఫ్టీ కమిటీ పేర్కొంది.

20 అంశాల సమాచారాన్ని కోరితే  కేసీఆర్ సర్కార్ 11 అంశాల సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది. కీలకమైన సమాచారం అసలు ఇవ్వలేదు. అవసరమైన సమాచారం అందించకపోతే, నిర్మాణ, నిర్వహణ క్రమంలో లోపాలు జరిగాయని భావించాల్సి వస్తుందని డ్యామ్ సేఫ్టీ హెచ్చరించింది. ఘోరమైన వైఫల్యాలు ఉన్నందునే కేసీఆర్ సర్కార్ 9 అంశాలను ఇవ్వకుండా దాటవేసింది. నాణ్యత నివేదికలు, థర్డ్ పార్టీ నాణ్యత పర్యవేక్షణ నివేదికలు, వర్షాకాలం ముందు, తర్వాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చర్ డ్రాయింగ్​కు సంబంధించిన వివరాలను అందజేయలేదు. బ్యారేజీ రక్షణకు అవసరమైన కీలక పరీక్షలు, అధ్యయనాలను కేసీఆర్​సర్కార్ తుంగలో తొక్కింది.  

మేడిగడ్డలానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు కూడా ఒకటే అయినందున మేడిగడ్డలాగానే వైఫల్యం చెందడానికి ఆస్కారం ఉంది.  అన్నారం బ్యారేజీలో ఇప్పటికే రెండు నుంచి మూడు పిల్లర్ల కింద బుంగలు పడ్డాయి. ఇది మేడిగడ్డలాగే వైఫల్యానికి ముందు సంకేతమని డ్యామ్ సేఫ్టీ పేర్కొంది. అన్నారం, సుందిళ్లలను యుద్ధప్రాతిపదికన పరిశీలించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నా,  వైఫల్య కారణాలపై సమగ్ర అధ్యయనానికి  అడుగులే పడలేదు. అధ్యయనంపై కేంద్ర డ్యాం సేఫ్టీకి, తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి.  

ఎన్నికల వేళ ప్రాజెక్టుల్లోని వైఫల్యం వెల్లడైతే పార్టీ పలుకుబడి దిగజారుతుందని అధ్యయనమే మానేశారు. కేంద్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ అడిగిన 20 అంశాల సమాచారం ఇవ్వకపోవడం చట్టరీత్యా నేరమే. 2002 జులై 13న వచ్చిన వరదలకు అన్నారం మేడిగడ్డ బాహుబలి మోటార్లు 8 విధ్వంసమైతే  నేటికీ మరమ్మతు కాలేదు.  2023 జులైలో వచ్చిన వరదలకు కూడా బ్యారేజీలు ఎంతో కొంత నష్టపోయి ఉంటాయి. ప్రభుత్వం కావాలనే రహస్యంగా దాచి ఉంచవచ్చు. ఇలా నాణ్యత లోపించిన అవినీతి నిర్మాణాలు, బ్యారేజీల వైఫల్యానికి కారణాలు వెల్లడైతే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోతామని భావించే  ప్రమాదకరమైన వాస్తవాలను కూడా ప్రభుత్వం ప్రజలకు వెల్లడించలేదు. 

సుప్రీంకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారించాలి

మేడిగడ్డలోని  బ్లాక్ 7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీలు కాదు. మొత్తం బ్లాకును పునాదుల నుంచి తొలగించి కొత్తగా పునర్నిర్మాణం చేయాలి. మూడు బ్యారేజీల్లో మళ్లీ కుంగిపోవడం ఎప్పుడైనా తలెత్తవచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. డ్యామ్ సేఫ్టీ పేర్కొన్నట్లు ఈ బ్యారేజీలకు భవిష్యత్తు లేదని తేలుతుంది.  మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం బ్యారేజీలో బుంగలు పడ్డాయి. కాళేశ్వరం భారీ ప్రాజెక్టు మొత్తం అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. తుమ్మిడిహెట్టి

 ప్రాణహిత మాత్రమే నిజమైన ప్రత్యామ్నాయం. 71 కి.మీ. గ్రావిటీ కాలువ,  కేవలం 19 మీటర్ల లిఫ్టుతో ఎల్లంపల్లికి ప్రాణహితను మళ్లించవచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వలే ఎల్లంపల్లికి 128 మీటర్ల ఎత్తయిన, భారీ ఖర్చయిన ఎత్తిపోసుడు ఉండదు. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టులు కేసీఆర్ మానస పుత్రికలుగా ప్రసిద్ధికెక్కాయి. మరి ఇంత గొప్ప ప్రాజెక్టులు ఎందుకు కుంగి పనికిరాకుండా పోతున్నాయో బీఆర్ఎస్ సర్కారే చెప్పాలి.

నాలుగు అంశాల్లో ఘోర వైఫల్యం

ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింట్​నెన్స్​లో తీవ్ర వైఫల్యం జరిగింది. బ్యారేజీ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల పియర్స్ (పిల్లర్ల) సపోర్టు బలహీన పడింది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత లేదు. సామర్థ్యం తక్కువగా ఉంది.  బ్యారేజ్ పై లోడ్ ఎక్కువగా పడింది.  పునాది బలహీనంగా ఉండడం, రాతిపై కాకుండా ఇసుకపై కట్టడం, 28 లక్షల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ఒత్తిడి పెరిగి ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడింది.  మొత్తం బ్యారేజీ నిర్వహణను గాలికి వదిలేసి నా సొమ్ము నాకు చేరింది కదా అనే పద్ధతిలో కేసీఆర్​ సర్కారు నిర్లక్ష్యంతో వ్యవహరించింది. వర్షాకాలానికి ముందు, తర్వాత అన్ని రకాల డ్యామ్​ నిశిత పరిశీలనను వదిలేసింది.

ఏవైనా సమస్యలు తలెత్తితే జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించాలని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అనేకసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. సమస్యలు తలెత్తుతున్నా బాహ్య ప్రపంచానికి వెల్లడి కాకుండా పోలీసు కవచాన్ని కాళేశ్వరం చుట్టూతా పెట్టింది.  మరిన్ని పిల్లర్లు కుంగకుండా ఉండడానికి, దెబ్బతిన్న బ్లాక్​ను కొత్తగా నిర్మించేవరకూ తీసుకోవలసిన చర్యలను కూడా డ్యామ్​ సేఫ్టీ కమిటీ సర్కారుకు హెచ్చరించి చెప్పింది. అయినా ముఖ్యమంత్రి,
 ఏ మంత్రి, ఏ ఉన్నతాధికారి నేటికీ కుంగిన మేడిగడ్డ వద్దకు పోయిన పరిస్థితి లేదు. 

నైనాల గోవర్ధన్  సోషల్​ ​ఎనలిస్ట్